ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. కరోనాను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా సంక్రాంతి పండగ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న ప్రజలు పల్లెలకు పయనమయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.
ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. అప్పటి వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్‌ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
గత విచారణలో పబ్లిక్ గేదరింగ్ పై నిషేధం విధించాలని హైకోర్టు ఆదేశించడంతో పబ్లిక్ ర్యాలీలు.. సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా టెస్టుల సంఖ్య పెంచాలని కూడా గత విచారణలో కోర్టు సూచించింది. అటు చిన్నారుల కోసం నీలోఫర్ తో పాటు ఇతర ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని కూడా కోర్ట్ ఆదేశించింది.
థియేటర్లు, షాపింగ్ మాల్స్ లలో నిబంధనలు కఠినతరం చేయాలని కూడా హైకోర్టు సూచించింది. కాగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే నైట్ కర్ఫ్యూ విధిస్తారు. ఇటు ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఉండటంతో నైట్ కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని నిపుణులు చెప్తున్నారు.