తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడి దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రలవుతున్నారు.
హైదరాబాద్ లోని గౌరిపురా మిత్రాక్లబ్ లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. 25 నుంచి మార్చి 1 వరకు జ్యోతర్లింగాలు దర్శనమివ్వనున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉచిత ధ్యాన శిబిరంతో పాటు ఆధ్యాత్మిక ప్రదర్శన నిర్వహించారు.
తెలంగాణలో ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం, మేడ్చల్ జిల్లా కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కోటగూలు జిల్లా, రామప్పలోని కాళేశ్వర ముక్తిశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిలాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మొట్టగుట్ట రామలింగేశ్వరస్వామి,జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్ లోని స్వయంభూ శంభులిగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాయలం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతూ.. పంచాక్షరీ మంత్రంతో మార్మోగిపోతున్నాయి.
ఇక ఏపీలోని శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి పది గంటల సమయం పడుతుంది. ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 10.30 గంటలకు పాదాలంకరణ అనంతరం స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.