- తెలంగాణపై విదేశీ కుట్రలు నిజమేనా..?
- క్లౌడ్ బస్టర్… ఎవరిని కాపాడటానికి..?
- ‘ఫోర్స్ మెజర్’ వెనుక కథేంటి..?
- ముఖ్యమంత్రి మాటలతో గందరగోళం
విదేశీ కుట్ర, ఫోర్స్ మెజర్ అనే పదాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పదాలు. ఇవి చరిత్రలోనే అత్యంత ఖరీదైన పదాలుగా మారబోతున్నాయి? ముఖ్యంగా “ఫోర్స్ మెజర్” గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. అయితే వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని సీఎం అంటే.. అసలు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇదే చర్చ జరుగుతోంది. అసలు ఈ పదాల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? సీఎం వ్యాఖ్యలకు గల గల కారణాలు తెలుసుకుందాం.
ఫోర్స్ మెజూర్ అంటే ఏదైనా కారణాలవల్ల కాంట్రాక్టరు చేసిన పనిలో నష్టం జరిగితే, ఆ నష్టాన్ని కాంట్రాక్టరు భరించాలా… లేక ఆ పని చేయించిన డిపార్ట్ మెంట్ భరించాలా…అన్న విషయాన్ని ఈ ఫోర్స్ మెజర్ అన్న నిబంధన ప్రకారం నిర్ణయిస్తారు. ఒకవేళ జరిగిన నష్టానికి పూర్తిగా కాంట్రాక్టరే బాధ్యుడని తేలితే, జరిగిన నష్టం మొత్తం కాంట్రాక్టర్ తన స్వంత ఖర్చులతో భరించాల్సి ఉంటుంది. జరిగిన నష్టంతో కాంట్రాక్టరుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నష్టం ఇతర కారణాల వల్ల జరిగిందని తేలితే.. అప్పుడు జరిగిన నష్టం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
నష్టం జరగడానికి కాంట్రాక్టరుకు సంబంధం లేని ఘటనలను ఫోర్స్ మెజర్ ఘటనలు అంటారు. తీవ్రమైన వరదలు, భూకంపాలు, తుఫానులు, టెర్రరిస్ట్ చర్యలు, యుద్ధాలు మొదలైనవి ఫోర్స్ మెజర్ ఘటనల కిందికి వస్తాయి. అయితే కాంట్రాక్టరు చేపట్టిన నిర్మాణాలకు ఏదైనా నష్టం జరిగితే, ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అన్న విషయం ముందుగా తేల్చాల్సి ఉంటుంది. ఇది అత్యంత కీలకం. దీనిని బట్టే భారం కాంట్రాక్టరు పైనా.. లేక ప్రజల పైనా అనేది నిర్ణయమవుతుంది.
మొన్నటి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్ లు మునిగిపోయాయి. మేడిగడ్డ పంప్ హౌస్ కాంక్రీట్ గోడ కూలడంతో మునిగిందని.. అన్నారం పంప్ హౌస్ లోకి వరద నీరు ప్రవేశించడంతో నీటిలో మునిగిందనీ వార్తలొచ్చాయి. వందల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాధమిక అంచనా. మరి, ఈ నష్టాన్ని ఎవరు భరించాలి…? కాంట్రాక్టరా…?ప్రభుత్వామా…?ఈ విషయం “ఫోర్స్ మెజర్” నిబంధన ఆధారంగా తేలుస్తారు.
ఒకవేళ మేడిగడ్డ పంప్ హౌస్ కాంక్రీట్ గోడ వరదనీటి కారణంగా, నాణ్యత లేకపోవడం వల్ల కూలితే అది కాంట్రాక్టరు లోపమే…! అలాగే అన్నారంలో వరదను డిజైన్ ప్రమాణాల కన్నా తక్కువగా అంచనా వేయడం… పంప్ హౌస్ లెవెల్ తప్పుగా నిర్ణయించడం… సరైన జాగ్రత్తలు వహించక పోవడం …ఇలాంటి కారణాలతో పంప్ హౌస్ మునిగితే కాంట్రాక్టరుదే తప్పు. జరిగిన నష్టానికి కాంట్రాక్టరే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలా కాకుండా నాణ్యతా లోపం, డిజైన్ లోపాలు లేకున్నా.. డిజైన్ స్థాయికి మించిన వరద కారణంగా మేడిగడ్డ పంప్ హౌస్ గోడ కూలితే.. అప్పుడు కాంట్రాక్టరు బాధ్యుడు కాదు. జరిగిన నష్టం ప్రభుత్వమే భరించాలి.
ఈ విషయం ఏది తెలియక ముందే.. దీనిని “విదేశీ కుట్ర” అనడం, “కనీవినీ ఎరుగని వరద విపత్తు”గా తేల్చేయడంతో.. ప్రభుత్వానికి దీనిపై కమిటీ వేసి తేల్చాల్సిన పని లేకుండా పోయింది. అంటే “విదేశీ కుట్ర” అనే పదం ఇప్పుడు చరిత్రలోనే అత్యంత ఖరీదైన పదంగా మారిపోయింది. రాష్ట్రంలో “విదేశీ కుట్ర” గురించి సీరియస్ గా చర్చోపచర్చలు చేసుకుంటుంటే, మరోవైపు కాంట్రాక్టరు మాత్రం చిద్విలాసంగా, రెట్టించిన ఉత్సాహంతో, మరోసారి వందల కోట్ల రూపాయల ప్రజా ధనంతో చేయడానికి సిద్దమౌతుంటాడు. మరి ఇవన్నింటి విముక్తి కోసం ప్రభుత్వం పన్నిన కుట్రగా పరిగణించాలా.?? లేక అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ప్రభుత్వానికి అవగాహన లేదు అనుకోవాలా అనేది గందరగోళం నెలకొంది.