ఓ దొంగ అర్థరాత్రి సమయంలో చోరీ చేయడానికి ఆలయంలోనికి వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కుషాయగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు చోరీకి యత్నించాడు.
ఆలయంలో తచ్చాడుతూ.. అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తాడు. ఆలయం హుండీలో చోరీకి యత్నించిన యువకుడు.. ఆ తర్వాత గర్భగుడి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆలయంలో రంగయ్య అనే వ్యక్తి వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నాడు. దుండగుడు ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడుతున్నట్లు గమనించిన వాచ్‌మెన్ .. అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో దొంగతనానికి వచ్చిన యువకుడు, రంగయ్యకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ ఘర్షణలో యువకుడు కిందపడిపోగా.. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఆలయంలోనే కూప్పకూలి చనిపోయాడు. ఆందోళనకు గురైన వాచ్‌మెన్ వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు.. దొంగతనానికి యత్నించిన యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి జేబులో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడి పేరు గండం రాజు (23)గా గుర్తించారు. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి అని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.