– చింతా ప్రభాకర్ కు షాక్ తప్పదా?
– ఎమ్మెల్యే రేస్ లో నలుగురైదుగురు..!
– బహిరంగంగానే ప్రచారం చేస్తున్న లీడర్లు
– ఈమధ్య బహిర్గతమైన అంతర్గత లుకలుకలు
– టికెట్ పై మాట్లాడొద్దన్నా వినని నేతలు
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ గులాబీ పార్టీలో అంతర్గతంగా దాక్కొని ఉన్న కిరికిరులు బయటపడుతూ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారవుతున్నాయి. అయితే అంతా బాగుందని అనుకుంటున్న నియోజకవర్గాల్లో సైతం టికెట్ కోసం ఇప్పటి నుంచే రగడ మొదలవ్వడంతో పెద్ద పరేషానీయే వచ్చిపడుతుంది. అసలు టికెట్ కోసం బహిరంగంగా ఇప్పుడే ఎవరు..ఏం మాట్లాడొద్దని పదే పదే అధిష్టానం చెబుతున్నా.. ఆశావాహులు లెక్క చేయకుండా పబ్లిక్ గా ప్రచారం చేయడం పెద్ద సమస్యలా మారింది. ఇక ఈ క్రమంలోనే అంతా సవ్యంగానే ఉంది..గతేడాదిలానే అతడికే టికెట్ ఖాయమని అధిష్టానం ఫిక్స్ అయి కాస్త రిలాక్స్ గా ఉన్న సంగారెడ్డి నియోజక వర్గంలోనూ.. పార్టీ నేతల మధ్య లుకలుకలు బయటపడడంతో అధిష్టానంలో టెన్షన్ మొదలైందంటా..
వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి సంగారెడ్డిలో మంచి గ్రిప్ ఉన్న నేత చింతా ప్రభాకర్. ఆయనకు కేసీఆర్ కు మంచి విధేయుడన్న పేరుంది. 2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి గెలిచిన చింతా ప్రభాకర్.. 2018 లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆయనకు అధినాయకత్వానికి ఉన్న అనుబంధంతో రాష్ట్ర హ్యాండులూమ్స్ ఛైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఆయనే సీనియర్ నేత కావడంతో పాటు అధినాయకత్వంతో ఆయనకున్న సాన్నిహిత్యంతో ఇప్పటి వరకు ఆయనకే టికెట్ పక్కా అని అందరూ భావించారు. చింతా ప్రభాకర్ కూడా ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రజల్లో చురుకుగా తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టారు.
అయితే ఆశావాహుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. నియోజక వర్గంలో తనకు ఎవరూ పోటీకి రారని చింతా అనుకుంటున్న క్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ పటోళ్ల మాణిక్యం ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నట్టుగా బహిరంగంగానే ప్రకటించేశారు. అయితే నేతలన్న తరువాత సీటు ఆశించడం సర్వసాధారణం. కాని సీనియర్ ఉన్న తరువాత.. తాను కూడా రేస్ లో ఉన్నానని పబ్లిక్ గా చెప్పేయడమే ఇప్పుడు సమస్యగా మారింది.
దీంతో సంగారెడ్డి లో మాత్రం అంతా సైలెంట్ గా సాగిపోతుందనుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వానికి పంచాయతీ వచ్చి పడినట్లైంది. ఇంకో వైపు ఇప్పుడే టికెట్ విషయంలో ఎవరూ పెదవి దాటి మాట రానీయ కూడదని పదే పదే అధిష్టానం మొత్తుకుంటున్నా.. పటోళ్ళ మాణిక్యం మనసులోని మాటను బహిరంగ పర్చడంతో అంతర్గతంగా ఉన్న లుకలుకలు బయటపడడమే కాకుండా.. క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడింది. ఇక ఇలా ఉంటే సదాశివపేటకు చెందిన పులి మామిడి రాజు,ఆత్మకూరు నగేష్ లాంటి లీడర్లు సైతం మేము కూడా రేస్ లో ఉన్నామని. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బయటపడడంతో సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. దీంతో తలపట్టుకుంటుంది గులాబీ క్యాడర్.