నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 14 న అంబేడ్కర్ జయంతి రోజునే సెక్రటేరియట్ ను ప్రారంభించనున్నట్లు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు అదే రోజున అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహాలను ప్రారంభించి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న సభకు పలు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించి వారితో రాష్ట్ర పథకాలపై మాట్లాడించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
సభకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలకు అప్పగించారు. జన సమీకరణ, సభ సక్సెస్ కు కార్యాచరణ సిద్ధమైంది. ఈ నెల 17 న సీఎం కేసీఆర్ బర్త్ డే ను పురస్కరించుకొని సెక్రటేరియట్,అమరవీరుల స్తూపం ప్రారంభించాలని భావించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం చేసినప్పటికీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది.
దీంతో ఎలాగైనా 14న ప్రారంభోత్సవాలు జరిపి రెండు లక్షల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం టార్గెట్ పెట్టుకున్నది. ఈ మేరకు కేడర్ కు మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి బెంగాల్, బీహార్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ , పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు సైతం ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం.
దీంతో ఓకే వేదికపై నలుగురైదుగురు సీఎంలు కూర్చుంటే దేశ వ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు కేసీఆర్ పనితనం దేశ ప్రజలకు తెలిసేలా సభను ప్లాన్ చేస్తున్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పై దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.