మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసింది. బెయిల్ పై తీర్పును మేడ్చల్ కోర్టు రిజర్వ్ చేసింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. పిటిషన్ పై విచారణ సందర్భంగా నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని కౌంటర్ దాఖలు చేశారు.
కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వొద్దని నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టు దృష్టికి తెచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరోవైపు నిందితుల పోలీస్ కస్టడీ ఇప్పటికే ముగిసిందని బెయిల్ మంజూరు చేయాలని వారి తరుపు లాయర్ న్యాయమూర్తిని అభ్యర్థించారు.
విచారణకు అన్ని విధాలా సహకరిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించినట్లు కోర్టు దృష్టికి తెచ్చిన డిఫెన్స్ కౌన్సిల్.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెప్పారని వివరించారు. కానీ.. ఆ పరిసరాల్లో 30కి పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని డిఫెన్స్ లాయర్ స్పష్టం చేశారు.
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కౌంటర్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తదుపరి విచారణను 31కి వాయిదా వేశారు.