- జల ప్రళయంతో ప్రజలు విలవిల
- సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూపులు
- రైతుల కష్టం వరదపాలు..
- జనం గోస పడుతుంటే రాజకీయాలకు పెద్దపీట!
- కేసీఆర్ సర్కారు తీరుపై ప్రజాగ్రహం
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణలో అధిక మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. కాలనీలు, చాలాచోట్ల ఇండ్లు నీటిలో మునిగాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చి గ్రామాల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంట నష్టం, ఆస్తి నష్టం అధిక మొత్తంలో జరిగినట్టు అంచనా. నీట మునిగిన కాలనీలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇండ్లు కూలిపోయాయి. వాహనాలు, వస్తువులు కొట్టుకొని పోయాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వైపు జల ప్రళయంతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే పెద్దపీట వేస్తోందనే విమర్శలు మూటగట్టుకుంటోంది.
ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, మెదక్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో పంటలపై భారీ వర్షాల ప్రభావం పడింది. హనుమకొండ జిల్లాలో 77,163 ఎకరాల్లో వివిధ పంటలు వేయగా చాలావరకు నీట మునిగాయి. వరంగల్ జిల్లాలో పత్తి, మొక్కజొన్న, కంది, పెసర 90 శాతం నీటిలో మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 వేల ఎకరాల్లో, పత్తి 24 వేల ఎకరాల్లో మునిగింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో కాకర, బీర తోటలు దెబ్బతిన్నాయి. ఇలా పలు జిల్లాల్లో పంట నష్టం ఆస్తి నష్టం అధికంగా వాటిల్లింది.
వారం రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రూ. 1,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా వర్షాలు, వరదలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. గోదావరి తీరం వెంట ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో వేలాది ఎకరాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. గురువారమే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ శుక్రవారం కూడా వివిధ విభాగాల ఆఫీసర్లు పెద్దగా రంగంలోకి దిగలేదు.
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అనేక గ్రామాలకు కరెంట్ సప్లయ్ఇంకా అందడం లేదు. భగీరథ మోటార్లు గోదావరిలో మునగడంతో చాలా ఏరియాలకు తాగునీరు అందడం లేదు. కీలకమైన రోడ్లకు తాత్కాలిక రిపేర్లు చేయకపోవడంతో వందలాది గ్రామాల్లో రాకపోకలు సాగడం లేదు. చెరువుల గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాల్సి ఉన్నా అధికార యంత్రాగం పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండ్లు కూలిపోయినవాళ్లకు తక్షణ సాయంగా రూ.5వేలు అందించాల్సి ఉన్నా ఎవరికీ నయాపైసా ఇవ్వడంలేదు. దీంతో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల ఇండ్లు కూలిపోయాయి. రాష్ట్రంలో వాన బీభత్సంతో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు సాయం అందించాల్సింది పోయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఓవైపు జల ప్రళయం జరిగిన క్లిష్ట పరిస్థితుల్లో కాళేశ్వరం పంపుహౌస్ లు మునగడం సాధారణమేనని, ఉద్యోగుల జీతాలు లేట్ కావడం సర్వసాధారణమేనంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను కోపోద్రిక్తులను చేశాయి. మరి ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతారో లేదో వేచి చూడాలి.