ఒక్కోసారి కొన్నింటిని చూసి ఆశ్చర్యపోక తప్పదు. అలాంటిదే ఒకటి వరంగల్ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబంలో చోటుచేసుకుంది. దీంతో అదృష్టమంటే ఇది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసుపత్రికెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారికి కేసీఆర్ కిట్ ను గిఫ్ట్ గా ఇచ్చి ఫోటోలు దిగారు. అంతలా ఏం జరిగిందని అనుకుంటున్నారా..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య కొమురమ్మ దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. వారిది నిరుపేద కుటుంబం. దీంతో కల్యాణ లక్ష్మి సాయంతో వారిద్దరి పెళ్ళి ఓకే రోజు ఓకే వేదికపై జరిగింది. ఇద్దరు కవలలకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు అందాయి.
ఇది ఇలా ఉంటే.. ఏడాది తర్వాత ఈ నెల 29న నర్సంపేట్ దవాఖాలో ఓకే రోజు ఇద్దరు ప్రసవించారు. వారిద్దరు కూడా పండండి మగబిడ్డలకు జన్మనిచ్చారు. దీంతో ఎంత కవలలైతే మాత్రం అంతా సేమ్ సేమ్ జరుగుతుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వార్త ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఈ సారి ఆ ఇద్దరు కవలలకు కేసీఆర్ ప్రభుత్వం తరపు నుంచి కేసీఆర్ కిట్లను అందచేశారు. దీంతో వారిద్దరు ఎమ్మెల్యేతో పాటు కేసీఆర్ సర్కార్ కు చేతులెత్తి దండం పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ అదే విధంగా కేసీఆర్ కిట్ లు వరంగా మారాయన్నారు.