మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల ప్రాణాలను మింగింది అపరిశుభ్రతే అని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అంతే కాదు వీరిద్దరితో పాటు అంతకు ముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మంది కూడా అనారోగ్యం పాలు కావడంతో వారిని హుటాహుటిన నిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్న పరిశుభ్రత లోపమే బాలింతల అనారోగ్యానికి కారణమని వైద్యుల బృందం గ్రహించడంతో ఆ 18 మందికి పెద్ద గండమే తప్పినట్లైంది.
అయితే ప్రాణాలు పోగొట్టుకున్న సిరివెన్నల,శివానీ ఇద్దరు బాలింతలు.. కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకడంతోనే మరణించారు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్ ఫెక్షన్ సోకడంతో రెండు రోజులుగా వారికి వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. వీరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
మరో 9 మందిని సోమవారం డిశ్చార్జి చేయగా.. ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. అయితే ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. కుటుంబీకులు, బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే మృతి చెందారంటూ మలక్ పేట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. పేదలకు దిక్కుగా ఉండాల్సిన సర్కార్ దవాఖానాల్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇక మలక్ పేట ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బలాల సందర్శించారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా ఐదు లక్షలు అందిస్తామని ఆర్డీవో ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేశామని వైద్య శాఖ కమిషనర్ వెల్లడించారు.