-ఏపీలో ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
– పలు చోట్ల ఉద్రిక్తతలు
-కడప, తిరుపతి జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు
-తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం
తెలుగు రాష్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీలో మూడు పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ రోజు ఎన్నికలు నిర్వహించారు.
ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. లైన్లలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో చోట్ల చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 10,59,420 మంది ఓటర్లు ఉండగా, మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరిగాయి.
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా స్థానాల్లో కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా స్థానాల్లో ప్రత్యర్థులెవరూ బరిలో లేకపోవడంతో వైసీపీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారు. ఏకగ్రీవం అయిన స్థానాల్లో అనంతపురం లోకల్ అథారిటీ (ఎస్.మంగమ్మ), కడప (పి. రామసుబ్బారెడ్డి), నెల్లూరు( మేరిగ మురళీధర్), తూర్పుగోదావరి( కుడుపూడి సూర్యనారాయణరావు), చిత్తూరు( సుబ్రమణ్యం సిపాయిల) వున్నాయి.
మిగిలిన స్థానాలు ఇవే…!
శ్రీకాకుళం స్థానిక సంస్థల నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ నుంచి 37, కడప–అనంతపురం–కర్నూలు నుంచి 49, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు నుంచి 22 మంది పోటీలో వున్నారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 8మంది, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు.
పలుచోట్ల ఉద్రిక్తతలు…!
రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తి నగర్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుపతి జీవకోన ఏరియాలో బూత్ నెంబర్ 233, 234లో నకిలీ ఓటర్లు పట్టుబడటంతో ఘర్షణ జరిగింది. పలు ఘటనలపై కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల ఆందోళనకు దిగారు. తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ జాబితాను వైసీపీ ఏజెంట్ తీసుకెళ్లడంతో టీడీపీ అభ్యంతరం తెలిపింది. దీంతో 15 నిమిషాల పాటు పోలింగ్‌ను నిలిపివేశారు.
ఎనిమిదిచోట్ల స్ట్రాంగ్ రూమ్‌లు..
పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపర్చేందుకు గాను ఎనిమిది ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ లను ఏర్్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 16న ఉదయం.8 గంటలకు కౌంటింగ్ వుంటుందని తెలిపారు. దీని కోసం ఇప్పటికే అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ముగిసిన పోలింగ్..!
ఉమ్మడి మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 జిల్లాల్లో 137 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిశీలించారు.