– ఉద్ధవ్ సర్కార్ కు కంగనా శాపం!
– ఆమె చెప్పిందే జరుగుతోందా?
– సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా శివసేన అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం ఖాళీ చేసి సొంతింటికి వెళ్లారు. అయితే.. దీనికి సంబంధించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు అదే నిజం అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఒక పక్క రాజకీయ వాదోపవాదాలు జరుగుతూ ఉండగా.. మరోవైపు ఇదంతా ఓ మహిళను ఏడిపించిన ఉసురే ఆయన సీఎం పదవిని కదిలించిందా అనే చర్చ దేశ రాజకీయాల్లో మొదలయింది.
కొన్నాళ్ల క్రితం కంగనా రనౌత్ బీజేపీకి మద్దతుగా శివసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. సీఎంతో పాటు ఆయన తనయుడిని తీవ్రంగా విమర్శించింది. ఆ సమయంలో శివసేన కార్యకర్తలు ఆమెను ముంబైలో తిరగనివ్వం అంటూ హెచ్చరించారు. కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆఫీస్ ను అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కూల్చేశారు.ఆ సమయంలో ఒక వీడియోను విడుదల చేసింది.
“నేడు నీ చేతిలో అధికారం ఉంది కనుక ఇలా చేశావు. కానీ.. ఆ అధికారం నీకు ఎప్పటికీ ఉండదు అని గుర్తు పెట్టుకో” అంటూ ఆ వీడియోలో హెచ్చరించింది. అంతేకాకుండా.. “ఒక మహిళను బాధ పెట్టిన ఏ ఒక్కరు సుఖపడినట్లు, సంతోషంగా ఉన్నట్లుగా లేదు. త్వరలోనే మీ పతనం ఉంటుంది” అంటూ మరో వీడియోలో శపించింది. అయితే.. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇప్పుడు మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో మరోసారి సోషల్ మీడియా పట్టాలు ఎక్కింది. ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లుగా ఆమె అభిమానులు వాఖ్యలు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.