ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం తార స్థాయికి చేరుతోంది. రోజురోజుకు ఉద్రిక్తతలు బలపడుతున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా వ్యూహాలు రచిస్తుంటే.. ఆ వ్యూహాలను ఎలాగైనా తిప్పికొట్టి తమ దేశాన్ని రక్షించుకోవాలని ఉక్రెయిన్ పోరాడుతోంది. ఈ యుద్ధంతో అమాయకుల జీవితాలను చిదిమేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. వారిలో వేలాదిమంది భారతీయులు కూడా ఉన్నారు.
ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధులను ఇండియాకు తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించామని పేర్కొన్నారు.
పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించినట్టు వెల్లడించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో 5300 మంది.. స్లోవేకియా నుంచి ఆరు విమానాల్లో 1118 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించినట్టు వివరిస్తూ జ్యోతిరాదిత్య ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను సొంత దేశానికి, ఏపీకి తరలించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థులను విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చామని సింథియా వివరించారు.