జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేశాడు డిప్యూటీ వార్డెన్. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది. డార్మేటరీ రూమ్ కు వెళ్లాడని.. చెప్పినట్టు వినడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఆగ్రహించిన వార్డెన్ నయీం.. విద్యార్థి రాజును చితకబాదినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన అంతా కళాశాల సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే.. కళాశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న సాగర్‌కు, డిప్యూటీ వార్డెన్ నయీంకు గతంలో విభేదాలొచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ గురించి తెలుసుకున్న సాగర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఘటన కు సంబంధించిన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన ప్రిన్సిపాల్ సాబిద్ అలీ.. ఆర్ట్ టీచర్ సాగర్, వార్డెన్ నయీంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్ధిపై జరిగిన దాడికి సంబంధిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్నుకుంటూ పిడిగుద్దులు గుద్దినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విద్యార్ధుల పట్ల మరో నయూం పుట్టుకొచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు.