అమెరికా ప్రెసిడెంట్‌గా డోనాల్డ్ ట్రంప్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తాను పదవిలో ఉన్న నాలుగేళ్లలో ట్రంప్ ఏకంగా 30,573 తప్పుడు ప్రకటనలు చేశారని అమెరికాలోని ప్రముఖ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని రాసింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే ట్రంప్ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని తెలిపింది. మరోవైపు టైమ్ మేగజైన్ ముఖచిత్రంగా ఎక్కువసార్లు కనిపించిన వ్యక్తి ట్రంపేనంటూ ఆ పత్రిక వెల్లడించింది. గడిచిన పదేళ్లుగా రాజకీయ నేతల ప్రకటనలను ఫ్యాక్ట్ చెక్ చేయగా.. తప్పుడు ప్రకటనలతో ట్రంప్ రికార్డ్ సృష్టించారని చెప్పుకొచ్చింది.
మొత్తం నాలుగేళ్లు పదవిలో ఉన్న ట్రంప్.. మొదటి సంవత్సరంలో రోజుకు సరాసరిగా 6 తప్పుడు ప్రకటనలు చేశారన్న ది వాషింగ్టన్ పోస్ట్.. రెండో సంవత్సరం ఆ సంఖ్య 16, మూడో సంవత్సరం 22, చివరి ఏడాదిలో ఏకంగా రోజుకు 39 అబద్ధాలు చెప్పేవారని వెల్లడించింది. ట్రంప్ అబద్ధాల కారణంగా.. అమెరికా ప్రజలు నిజాలని కూడా అబద్దాలుగా భావించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది.
ట్రంప్ చెప్పిన మొత్తం అబద్దాల్లో సగం అధ్యక్ష ర్యాలీలు, ట్విటర్ అకౌంట్‌ల నుంచే చెప్పినట్టుగా వివరించింది. ఈ మొత్తం అబద్ధాల్లో అత్యధికంగా అమెరికా అర్ధిక వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దానంటూ 2500, అమెరికా చరిత్రలోనే అత్యధికంగా పన్నుల తగ్గింపు చేశానంటూ 300 సార్లు అబద్ధపు ప్రకటనలు ట్రంప్ చేశారని ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో చెప్పింది.