కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారున ఘటన గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్ లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కు చెందిన అంజికి, పట్టణానికి చెందిన అంకాలమ్మతో పదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మొదట్లో ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. గత కొంత కాలంగా అంజి తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. తనను అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. ఎప్పటిలాగానే ఆదివారం అర్ధరాత్రి దాటాక మద్యం సేవించిన ఇంటికి వచ్చాడు అంజి. తాగిన మైకంలో భార్యతో గొడవ పెట్టుకొని చెయి చేసుకున్నాడు.
భర్త వేధింపులను తట్టుకోలేక అసహనానికి గురైన అంకాలమ్మ.. పక్కనే ఉన్న రోకలితో భర్తపై దాడి చేసింది. గాయాలతో పడిపోయిన భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. అంజి శరీరం కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అంజి మృతి చెందినట్టు నిర్ధారించుకున్న అంకాలమ్మ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను తానే హత్య చేశానని చెప్పినట్లు తెలిపింది.
సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై స్థానికుల వద్ద ఆరాతీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.