స్థానిక ఆర్డీవో తనని హీనంగా చూస్తున్నారంటూ.. జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత జిల్లా కలెక్టర్ ముందు బోరున ఏడ్చారు. అయితే సామాన్యుల కష్టాలు పరిష్కరించే…ప్రజావాణి కార్యక్రమంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.
జనగామ ఆర్డీఓ మదన్ మోహన్ తనకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందారు. తనను అటెండర్ కంటే హీనంగా చూస్తున్నారని రజిత కలెక్టర్ ముందు బాధపడ్డారు. ఈ విషయమై కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఆమె. ఆర్డీవో తనను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో… వివరిస్తూ మున్సిపల్ కమిషనర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆమె ఆవేదన విన్న కలెక్టర్.. ఓదార్చారు. తన సమస్యేంటో పూర్తిగా తెలుసుకున్న కలెక్టర్… తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. లేఖలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా రాయాలని మున్సిపల్ కమిషనర్ రజితను కలెక్టర్ కోరారు.
అయితే ప్రజల ముందు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో.. సర్వత్రా చర్చనీయాంశమైంది. కలెక్టర్ ఆర్డీవో పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.