ఆలయానికి వెళ్లి వస్తున్న మహిళలపై కొందరు దుండగులు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తుకారం గేట్‌లోని మరాఠా బస్తీ వద్ద చోటుచేసుకుంది.
మరాఠా బస్తీ కి చెందిన మహిళ అక్కడే ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తోంది. మార్గమధ్యంలోకి వచ్చాక కొందరు యువకులు రహదారికి అడ్డుగా ఉన్నారు. అయితే సదరు మహిళ వారిని పక్కకు జరగమని అడిగింది. దీంతో ఆ యువకులు ఘర్షణకు దిగారు. అందుకు సంబంధించిన వివరాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
కావాలనే గొడవకు దారితీసే ప్రయత్నం చేస్తున్నారని గమనించిన మహిళ.. పక్కకు తప్పుకొని వెళ్తుండగా.. కావాలని కర్రలు, రాళ్లతో మహిళపై దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దాడికి పాల్పడిన వారు మైనర్లుగా గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వారంతా గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డట్టు విచారణలో వెల్లడైందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.