ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది పోలీసులకు తల నొప్పులను తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే భయపడేవారు. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసు ఉండడం వల్ల పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులతో పాటు నిందితులను కూడా పోలీసులు బెదిరించకపోవడంతో కొందరు రెచ్చిపోతున్నారు.
పోలీసులంటే గౌరవం లేకుండా పోతుందని పోలీసు అధికారులే వాపోతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్‌లలో జరిగిన సంఘటనలు చూస్తుంటే పోలీసులే ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసులంటే లెక్క చేయకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. గురువారం జిల్లాలోని గాంధారి పోలీసుస్టేషన్‌లో ఓ వివాదం విషయంలో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసినందుకు వారి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేయడంతో పాటు కొందరు సిబ్బందిపై దాడికి యత్నించారు.
గురువారం గాంధారి పోలీసుస్టేషన్‌లో మండల కేంద్రానికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు గత మంగళవారం మాంసం విక్రయించే షఫీతో తగదా పడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జుబేర్, అజ్మత్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా వారి వెంటే వచ్చిన కుటుంబ సభ్యులు, మహిళలు పోలీసులతో పెద్దఎత్తున వాగ్వాదానికి దిగారు.
తాము రాజీకుదుర్చుకుంటామని మీరు కేసు ఎందుకు పెడుతున్నారంటూ గొడవపడుతూ మహిళలు పోలీసులపై దాడులు చేశారు. ఈ గొడవలో కానిస్టేబుల్‌తో పాటు పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని సదాశివనగర్ సీఐ రామన్ ఆధ్వర్యంలో తాడ్వాయి, సదాశివనగర్ పోలీసులు గాంధారి పోలీసుస్టేషన్‌కు చేరుకుని దాడులకు పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.