కరోనా మహమ్మారి తాకిడికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటికే అనేక సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రజలు మరోసారి మహమ్మారితో సహజీవనానికి సిద్ధం అవ్వాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. కాస్త తగ్గినట్టే తగ్గి మరోసారి తన విశ్వ రూపం చూపించడానికి తయారైంది.
ఆసియా ఖండంతో పాటు యూరోప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్ గా ఉండాలని కోరింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని.. వైరస్ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని.. సీజనల్ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.
మరో ఏడాదిపాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేదంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలని మైక్ ర్యాన్ సూచించారు.