ఢిల్లీలో ఇటీవల హిట్ అండ్ రన్ కేసులో హతురాలు అంజలీ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. కరణ్ విహార్ లోని తమ ఇంటి తాళం విరగ్గొట్టి దొంగలు టీవీతో సహా విలువైన వస్తువులన్నీ దొంగిలించుకుపోయారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ చోరీ వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండవచ్చునన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు తాము వచ్చేసరికి పొరుగింటివారు ఈ చోరీ విషయం తెలిపారన్నారు.
తాము ఇంటిలోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయని, రెండు నెలల క్రితమేకొన్న ఎల్ సీడీ టీవీ తో బాటు మరికొన్ని ఖరీదైన వస్తువులను ఎత్తుకుపోయారని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసుల తీరుపైకూడా అనుమానాస్పదంగా ఉందని ఈ కుటుంబ సభ్యులొకరు చెప్పారు. గత 8 రోజులుగా పోలీసులు తమ ఇంటివద్ద ఉన్నారని, కానీ నిన్న వారు ఒక్కరు కూడా లేరని అంజలి సమీప బంధువు తెలిపారు. బహుశా ఈ చోరీ వెనుక నిధి పాత్ర ఉండవచ్చునన్నారు.
ఆమె ప్రవర్తనపై గతంలోనే ఆయన అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ నెల 1 న ఆదివారం.. కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అంజలి మద్యం తాగిందని చెప్పడం ద్వారా నిధి కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఆమెకు అన్నీ తెలిసి ఉండవచ్చునన్నారు. అయితే అంజలికి మద్యం తాగే అలవాటు లేదని, నిధి అబధ్ధం చెబుతోందని అంజలి తల్లి ఆనాడే ఖండించింది. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కి పాల్పడిందన్న ఆరోపణపై నిధిని లోగడ.. 2020 లో ఆగ్రాలో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 1న అంజలి ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టిన కారు ఆమెను సుమారు 12 కి.మీ. దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఆమె దారుణంగా మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం.. అంజలి తమ కారు చక్రాల కింద చిక్కుకున్న విషయం తమకు తెలుసునని ఈ కేసు నిందితులు పోలీసులకు తెలిపారు. అయితే తమను తాము రక్షించుకునేందుకు కారును నడుపుకుంటూ పోయామని వారు చెప్పినట్టు తెలిసింది.