ఈ మధ్య దొంగలు బాగా తెలివిమీరిపోతున్నారు. ఏటీఎం మిషన్ బాగు చేయడానికి వచ్చినట్లే వచ్చి ఏటీఎంలో డబ్బులే ఎత్తుకెళ్లాడు ఓ ఘరాన దొంగ. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని యాక్సిస్ బ్యాంకులో జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త సాయిబాబా గుడి రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం మిషన్ చెడిపోయింది.
దీంతో ఓ వ్యక్తికి కాల్ చేసి పిలిచారు బ్యాంకు సిబ్బంది. అయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి దాని సరిచేసినట్లు చేసి వెళ్తూ, వెళ్తూ దుండగుడు ఏటీఎం మిషన్లోంచి 50వేలతో ఉడాయించాడు.
అయితే, అతడు వెళ్లాక ఏటీఎం మిషన్లో అమౌంట్ తక్కువగా రావడంతో ఆందోళన గురైయ్యారు బ్యాంకు సిబ్బంది.. అప్పుడే అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే, ఏటీఎం మిషన్ బాగు చేసే సమయంలో బ్యాంకు సిబ్బంది కూడా అతని పక్కనే ఉంటారని.. ఈ సమయంలోనే అతను డబ్బులతో ఎలా ఉడాయించాడన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.