తిరుపతి : కొండమీదకు దుండగులు వచ్చారని పోలీసులు కొద్దిరోజుల క్రితం ఓ హెచ్చరికలాంటిది చేశారు. అసలు దొంగలు ఇంట్లోనే వున్నారు. తిరుమల క్షేత్రంలో సాక్షాత్తూ స్వామివారి వెండి కిరీటాన్నే ఇంటి దొంగలు మాయం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రెజరీలోని ఐదు కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా పోయాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దోపిడీ.. ఇప్పుడు తిరుమలలో కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీటీడీ ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు. అసలు ఈ చోరీ వెనుక ఎవరున్నారనేది బయటికి తీయకుండా చిన్న శిక్షతో సరిపెట్టేస్తే ఎలా అన్నదే ప్రశ్న. ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేసి మేటర్‌ని ఇక్కడితో క్లోజ్ చేసేయాలన్న టీటీడీ వైఖరిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పూర్తి విచారణ జరపకుండా ఒకరినే ఎందుకు బాధ్యుల్ని చేశారన్న దానిపై క్లారిటీ రావాలి.