కొద్ది రోజుల క్రితం అబిడ్స్ సర్కిల్ లోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ స్నిగళ్లు ఆకస్మాత్తుగా ఆగిపోయాయి. వెంటనే ట్రాఫిక్ అధికారులు పరిశీలించగా బ్యాటరీ కనిపించలేదు. దీంతో వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాటరీ ఏమైంది అని పోలీసులకు దర్యాప్తు చేయగా.. అలా ఒకటి కాదు ఏకంగా 74 బ్యాటరీలు మాయమైనట్లు వారు గుర్తించారు. ఇద్దరు నిందితులు ట్రాఫిక్ సిగ్నళ్లకు అమర్చిన బ్యాటరీలను చోరీ చేస్తున్నట్లు తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్‌హౌస్, హబీబ్‌నగర్, గోపాలపురం, మలక్‌పేట్, షాహినాయిత్ గంజ్, సైఫాబాద్, చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లు వరుసగా పని చేయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించగా, బ్యాటరీలు కనిపించ లేదు. కొత్త బ్యాటరీలు ఏర్పాటు చేసి, సిగ్నల్స్ వద్ద బ్యాటరీలు కనిపించడం లేదని ట్రాఫిక్ విభాగం సిబ్బంది లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నెల 12న ఆబిడ్స్ సర్కిల్‌లోని ప్రధాన కూడలి వద్ద సిగ్నల్స్ పని చేయడం ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి అబిడ్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వందల సంఖ్యలో సీసీ ఫుటేజీలను పరిశీలించి రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురం ప్రాంతంలో లేబర్‌గా పని చేస్తున్న జంగాల మదిలేటి మరొకరితో కలిసి బ్యాటరీలను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు.
అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ వద్ద ఉన్న మదిలేటిని, అతని స్నేహితుడు ఆటో డ్రైవర్ షేక్ ఆజాముద్దీన్ అలియాస్ ఆజాంను ఆబిడ్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విచారణలో 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 బ్యాటరీలను దొంగిలించినట్లు తేలింది. దీంతో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన నిందితులు రాత్రి లేదా తెల్లవారు జామున సిగ్నల్స్ వద్దకు వచ్చి స్తంభాల వద్ద ఉన్న బాక్స్ నుంచి బ్యాటరీలను దొంగిలించి అమ్మేవారని తేలింది.
వీరి వద్ద రూ. 5 లక్షల విలువైన 26 పెద్ద బ్యాటరీలను, 48 చిన్న బ్యాటరీలను రికవరీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, ఎస్‌ఐలు గౌరేందర్ గౌడ్, నిరంజన్, సిబ్బంది రాజ్‌కుమార్, రతన్, రవికుమార్ యాదవ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.