దొంగలు సాధారణంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారి గురించి ఆధారాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే, ఓ దొంగ మాత్రం ‘దమ్ముంటే తనని పట్టుకోండి చూద్దాం’ అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. అంతేకాదు తన ఫోటోను పోలీసులకు పంపించటంతో.. ఈ ఛాలెంజ్‌ను సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్నారు.
రాజస్థాన్ జైపూర్ కు చెందిన సత్యేంద్ర సింగ్ షెకావత్ టెక్నాలజీ సాయంతో ఖరీదైన కార్ల చోరీలకు పాల్పడేవాడు. వీఐపీలు, సెలబ్రిటీల కార్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసేవాడు. షెకావత్ ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 60 కార్ల వరకు చోరీ చేశాడు. ఈ క్రమంలో 2021లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కన్నడ సినీ ప్రొడ్యూసర్ వీ.మంజునాథ్ కారు అపహరించటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే, అతడిని పట్టుకోవడంలో పోలీసులకు పలు చిక్కులు ఎదురయ్యాయి. షెకావత్ స్వస్థలం జైపూర్ అని గుర్తించిన పోలీసులు అక్కడకి వెళ్ళేసరికే అతడు అక్కడి నుంచి ఉడాయించాడు. అంతటితో ఆగకుండా ‘నమస్తే సార్.. మీరు జైపూర్ వచ్చినట్టు తెలిసింది. నేనిప్పుడు బెంగళూరులో ఉన్నాను.. ఎలాగూ మా ఇంటికి వచ్చారు కాబట్టి మా ఆవిడ మీకు రుచికరంగా వండి పెడుతుంది. తినివెళ్లండి’ అంటూ వాట్సాప్ కాల్ చేసి పోలీసులనే కవ్వించాడు.
అంతేకాదు, ‘మీ టెక్నాలజీ కంటే ఐదేళ్లు ముందున్నా.. మీరు నన్ను పట్టుకోలేరు కావాలంటే నా ఫోటో పంపిస్తున్నా చేతనైతే పట్టుకోండి’ అంటూ సత్యేంద్ర సింగ్ పోలీసులకే సవాల్ చేశాడు. దీంతో షెకావత్ అంశాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు అనేక ప్రయత్నాల అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై హైదరాబాదులో పలు కేసులు ఉండడంతో పీటీ వారెంట్ మీద బెంగళూరు నుంచి తీసుకువచ్చారు.