జలియన్‌వాలాబాగ్ మారణకాండ మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నివాళులర్పించారు. జలియన్ వాలా బాగ్ ఘటనను గుర్తు చేసుకుంటూ వారి అసమాన ధైర్య, త్యాగాలను ప్రజలకు గుర్తు చేస్తూ మోడీ ట్వీట్ చేశారు.
గతేడాది పునర్నిర్మించిన జలియన్‌వాలాబాగ్ స్మారక కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ప్రసంగాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు. ‘ 1919లో ఈ రోజున జలియన్‌వాలాబాగ్‌లో అమరులైన వారికి నివాళులు. వారి అసమానమైన ధైర్యం, త్యాగం రాబోయే తరాలను చైతన్యవంతం చేస్తూనే ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని గత ఏడాది ఆగస్టు 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఏప్రిల్ 13, 1919 నాటి ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటానికి అజరామరమైన కథగా మారాయని అన్నారు. దాని కారణంగా మనం అమృత మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జలియన్ వాలా బాగ్ మృతులకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ విదేశీ పాలకుల క్రూరత్వానికి, క్రూరమైన దురాగతాలకు ప్రతీక అయిన జలియన్‌వాలాబాగ్ మారణకాండలో అమరవీరులైన వారి ధైర్యానికి, పరాక్రమానికి నేను నమస్కరిస్తున్నాను’ అని ట్వీట్ లో తెలిపారు.