– కేసీఆర్ ను ఇతర రాష్ట్రాల్లో నమ్మే పరిస్థితి ఉందా?
– 8 ఏళ్లలో తెలంగాణకు మిగిలింది అప్పులేగా!
– మరి.. ఇక్కడి స్ట్రాటజీలతో అక్కడ వర్కవుట్ అవుతుందా?
– బీఆర్ఎస్.. మరో ఎంఐఎం, టీఎంసీలా మిగిలిపోతుందా?
– ఇప్పటిదాకా జాతీయ హోదా పొందిన పార్టీలెన్ని?
– వాటిలో.. లాక్కోలేక.. పీక్కోలేక సైలెంట్ అయినవెన్ని?
– ప్రాంతీయ కట్లు తెంచుకుని కేసీఆర్ జాతీయనేతగా ఎదగగలరా?
– సారు ఇన్స్పిరేషన్ తో కేఏ పాల్ కూడా.. జాతీయ పార్టీ అంటే!
ప్రస్తుతం కేసీఆర్ శ్వాస, ధ్యాస అంతా జాతీయ పార్టీనే. ప్రధాని కావాలన్న లక్ష్యంతో ఎంతో ఆర్భాటంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ ను ఓ ఆటాడేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో దేశాన్ని ఏలాలని పగటి కలలు కంటున్నారని విమర్శిస్తున్నాయి. అసలు, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసి దేశాన్ని కూడా అలాగే చేస్తారా? అంటూ చురకలంటిస్తున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తూ పలు అంశాలను లేవనెత్తుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
గొప్ప పథకాలు, కార్యక్రమాలు అంటూ టీఆర్ఎస్ చేసుకుంటున్న ప్రచారం.. నిజంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడిందా? అనే ప్రశ్నను బలంగా వినిపిస్తున్నారు విపక్ష నేతలు. రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో గొప్ప ముందడుగు వేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రీ డిజైనింగ్ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుల కోసం చేసిన అప్పు ఎంత? సాధించిన ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం ఎంత? తప్పుడు డిజైన్లతో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురై ప్రజలకు జరుగుతున్న నష్టం ఎంత? అని నిలదీస్తున్నారు. భారీగా కరెంట్ ఖర్చు పెట్టి నదుల నుండి రిజర్వాయర్లలోకి ఎత్తి పోసిన నీళ్లెన్ని? సరైన ప్రణాళిక లేకుండా వానా కాలంలోనే మళ్ళీ నదులలోకి తిప్పి పోసిన నీళ్ళెన్ని? సమాధానం చెప్తారా? అని కడిగిపారేస్తున్నారు. తెలంగాణ మాదిరిగానే దేశ వ్యాప్తంగా వేల కోట్ల అవినీతి చేయడానికి, కమీషన్లు సంపాదించడానికి, ఇక్కడి కాంట్రాక్టర్లను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి తప్ప ఈ రంగంలో మంచి అనుభవాలు ఏమున్నాయని? ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇవే కాదు రైతు బంధు, దళిత బంధు, ఇలా చాలా పథకాల్లో అసలైన లబ్దిదారులకు సాయం అందడం లేదని విమర్శిస్తున్నారు.
ఇక రాజకీయ పండితులు సైతం బీఆర్ఎస్ పై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏ ధైర్యంతో కేసీఆర్ ఈ ఆలోచన చేశారో అర్థం కావడం లేదంటున్నారు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అని గులాబీ నేతలు చెబుతున్నా.. ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం కాలేదు. సకల జనులు కొట్లాడి సాధించుకున్నారు. టీఆర్ఎస్ నేతలు తమ నేతను ఎంతగా ప్రమోట్ చేసుకున్నా అసలు విషయాలు జనాలకు ఏదో ఒకరోజు అర్థం అవుతాయని అంటున్నారు విశ్లేషకులు. 20 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రాంతీయ వాదాన్నే నమ్ముకుని నడుస్తున్నారని.. అలాంటి నేత ఇతర రాష్ట్రాల ప్రజలు తమ నేతగా స్వీకరించగలరా? తానే కట్టుకున్న ప్రాంతీయత కట్లు తెంచుకుని జాతీయనేతగా ఎదగగలరా? అనేది పెద్ద చిక్కుముడే అని చెబుతున్నారు.
దేశంలో కొత్త జాతీయపార్టీ నినాదం విని చాలాకాలమే అయింది. బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ పేర్లలో ఆల్ ఇండియా అని పేరు పెట్టుకున్నా(ఏఐఏడీఎంకే, ఏఐఎమ్ఐఎమ్, ఏఐటీఎంసీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) అవేవీ అఖిల భారత పార్టీలు కాలేకపోయాయని వివరిస్తున్నారు రాజకీయ పండితులు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రెండు మూడు రాష్ట్రాలలో పోటీ చేసో, ఒకటి అరా సీట్లు గెలిచో నేషనల్ పార్టీ హోదా సంపాదించుకున్నాయి గానీ, అసలైన అఖిల భారత పార్టీలుగా విస్తరించలేకపోయాయి. మరొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా పొందిన ప్రాంతీయ పార్టీల ఆనవాళ్లు సొంత రాష్ట్రం బయట నామమాత్రమే. ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం రాను రాను తగ్గిపోయింది. ఆఖరికి జాతీయ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం అంచుల దాకా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ కు పోటీగా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఆకట్టుకోవడం కష్టమనే చెబుతున్నారు. అంతెందుకు.. కొందరైతే కేసీఆర్ కు కేఏ పాల్ కు పోలిక పెడుతున్నారు. పాల్ పార్టీ కూడా ఏపీ, తెలంగాణలో ఉంది. ఇప్పుడు కేసీఆర్ స్ఫూర్తితో ఆయన కూడా ప్రజాశాంతి పార్టీని భారత్ ప్రజాశాంతి పార్టీగా మార్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కేవలం తెలంగాణకే పరిమితమైన కేసీఆరే జాతీయ పార్టీ పెట్టంగా లేనిది.. ప్రపంచ దిగ్గజాలతో సత్సంబంధాలు ఉన్న పాల్ పెట్టకూడదా? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.