బీజేపీ పోలింగ్ బూత్ సశక్తి కరణ్ అభియాన్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది టీబీజేపీ. ఇందులో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ ఛార్జీలు,సశక్తి కరణ్ అభియాన్ రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలతో పాటు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
సరల్ యాప్, పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్య అంశాలను కింది స్థాయికి తీసుకువెళ్లడం పై కూడా సమావేశంలో చర్చించారు. కార్నర్ మీటింగ్ లు జరుగుతున్న తీరు, వస్తున్న స్పందన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ శక్తివంతం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని.. కేసీఆర్ ప్రజా పాలనను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిప్డడారు ఆయన. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా ఉంటుందన్న నమ్మకం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు,నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయం బీజేపీ నే అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలు లేవు, శక్తి కేంద్రాలు లేవని బండి సంజయ్ పేర్కొన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడం వల్లే 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని, ఇప్పటి వరకు 80 శాతం మండల కమిటీలు, శక్తి కేంద్రాలు , బూత్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.