హైదరాబాద్ లోనూ.. కోడి పందాలకు ఏటేటా క్రేజ్ పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఏటా కోడి పందాలను నిర్వహిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 3 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కోళ్ల పందానికి సిటీలోని చాలా ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో పందం కోళ్లకు డిమాండ్ ఏర్పడింది.
నగర శివారు ప్రాంతాల్లో పందం కోళ్లను పెంచి అమ్ముతున్నారు. వీటి కోసం ఫాం హౌస్ లు, పౌల్ట్రీ ఫామ్ లలో ఏర్పాట్లు చేసిన షెడ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందినోళ్లు కోళ్లను కొంటున్నారని పందం కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. మొయినాబాద్, రాజేందర్ నగర్, అబ్ధుల్లాపూర్ మెట్, శామీర్ పేట్, కీసర,ఇబ్రహీం పట్నం,బార్కస్ తదితర ప్రాంతాల్లో పందం కోళ్లను పెంచి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అమ్ముతున్నారు.
కోడిని బట్టి 30 వేల నుంచి లక్షలకు పైగా ధరలు ఉంటున్నాయి. ఇక ఆన్ లైన్ లోనూ కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు పలు యాప్ లు వినియోగిస్తున్నట్లు తెలిసింది. కోడి పందాలు ఆన్ లైన్ లో చూస్తూ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీ లో జరుగుతున్న కోడి పందాలకు ఆన్ లైన్ లో సిటీ నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్స్ లో పాల్గొంటున్నారు.
మరో వైపు హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు ఒకటి రెండు ప్రాంతాల్లో రహస్యంగా కోడి పందాలు నిర్వహించేవారు. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల రహస్యంగా కోడి పందాలు జరుగుతున్నాయి. వస్థలిపురం,అబ్దుల్లా పూర్ మెట్, హస్తినా పురం, నాగోల్, ఎల్బీనగర్, కూకట్ ప్లలి, మియాపూర్, పుప్పాలగూడ, పిర్జాదిగూడ, నాగారం, కీసర, అంబర్ పేట్ బతుకమ్మ కుంట తదితర ప్రాంతాల్లో పందాలు జరుగుతున్నాయి. వీటి కోసం శివారు ప్రాంతాల్లో పెంచిన పందం కోళ్లతో పాటు వరంగల్ నుంచి కోళ్లను తీసుకొస్తున్నట్లు సమాచారం.