రోడ్ల పై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో పై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విపక్షాలను కట్టడి చేయాలన్న దురుద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.అయితే, ఆ జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు.. విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు సజ్జల.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దానిని చీకటి జీవో అనడంలో అర్థం లేదన్నారు. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు వైసీపీకి కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు సభలు,సమావేశాలు అస్సలే నిర్వహించకూడదు అనలేదు కదా.. అని ఎదురు ప్రశ్నించిన సజ్జల.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్స్ లలో సభలు నిర్వహించుకోవచ్చు అని సూచించారు.
ఇక ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులపై పోలీసులకే విచక్షణాధికారం ఉంటుందన్నారు సజ్జల. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు పోలీసులు విపక్షాలకు సైతం ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఆయన.. ఈ నిబంధనలు పోలీసు చట్టంలో ఉన్నవే అన్నారు. కందుకూరు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని.. ఇరుకు రోడ్లలో సమావేశాలు నిర్వహించి తొక్కిసలాటలో 8 మంది చనిపోవడం వల్ల కొత్త నిబంధనలు తీసుకొని రావల్సిన అవసరం ఏర్పడిందన్నారు.రోడ్ల నిర్మాణం ప్రయాణాల కోసమే…కానీ బహిరంగ సమావేశాల కోసం కాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తాం, బరితెగిస్తాం అంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని విపక్షాలను హెచ్చరించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
అయితే ఏపీ సర్కార్ రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షో లపై మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్, పంచాయితీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు ప్రకారంగా ఉన్న నిబంధనలను మార్గదర్శకాలుగా సూచించింది. ఇక ముందు రోడ్లపై బహిరంగ సభలు,ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించేటప్పుడు తప్పని సరిగా అవి ఫాలో అవ్వాల్సిందేనని కండీషన్ పెట్టింది. రోడ్డు మార్జిన్ల దగ్గర అదే విధంగా పంచాయితీ రహదారుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో జన సమూహం భారీగా తరలి వచ్చే సభలకు అనుమతులివ్వొద్దని అధికారులకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.