ఏపీలో ఉద్యోగ పీఆర్సీపై స్పష్టమైన నిర్ణయం వెలువడటం లేదు. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరోసారి సమ్మెకు పూనుకున్నారు. దీంతో ఏపీలో మరోసారి పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.
అయితే.. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. సీఎంతో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించారాని అయన అన్నారు. అయినప్పట్టికీ.. మళ్లీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేయటం సరికాదన్నారు.
వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని అన్నారు. సామన్య ప్రజలతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. సీఎం ఒక నిర్ణయం తీసుకున్నరంటే అది అందరికీ ఉపయోగ పడేదే అయి ఉంటుందని అన్నారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్నా దాని తీవ్రత అంతలా లేదని ఆయన అన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా పిల్లలకు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామన్నారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని.. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.