రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పెద్దగా హడావుడి కనిపించిడం లేదు. మొదటి రోజు హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడి అంతంత మాత్రంగానే కొనసాగింది. బ్యాంకుల వద్ద పెద్దగా జనాలు ఏమీ కనిపించడం లేదు.
మొదటి రోజు శేరిలింగంపల్లి వ్యాప్తంగా అన్ని ప్రధాన బ్యాంకుల వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి హడావుడి కనిపించలేదు. రోజు మాదిరిగానే ఈ రోజు కూడా బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఎవరి దగ్గరైనా తక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు వుంటే వారు తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చి మేనేజర్ వెల్లడించారు.
అటు సికింద్రాబాద్, తార్నాక ప్రాంతంలోనూ బ్యాంకుల దగ్గర సందడి ఏం కనిపించలేదు. పాతబస్తీలోని బ్యాంకులన్నీ ఎప్పటి లాగే పని చేశాయి. రూ. 2వేల నోట్లు పట్టుకుని బ్యాంకుల వద్దకు ఎవరూ రాలేదని సిబ్బంది చెప్పారు. ఇక అంబర్ పేట్ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కొనసాగింది.
సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్‌లోని పలు బ్యాంకుల్లో పెద్దగా జనాలు కనిపించలేదు. జూబ్లీహిల్స్‌లో మాత్రం కొన్ని బ్యాంకుల్లో రూ.2000 వేల నోట్లు డిపాజిట్ అవుతున్నాయని సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు రూ.20 నుంచి రూ. 30 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేశారనీ, సెప్టెంబర్ 30 వరకు సమయం ఉందని బ్యాంక్ అధికారులుతెలిపారు.