వరంగల్ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని అన్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్లు తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందుతోందని వైద్యులు బులిటెన్ లో పేర్కొన్నారు.
నిపుణుల బృందం ఆధ్వర్యంలో పీజీ విద్యార్థినికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఇక వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. తాజాగా నిమ్స్ ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారు. వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఇక వైద్య విద్యార్థిని తన తల్లితో మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తన బాధను తల్లితో పంచుకున్నట్లు ఆడియో వింటే అర్థం అవుతోంది. సైఫ్ తనతో సహా చాలా మంది జూనియర్లను వేధిస్తున్నారని తల్లితో చెప్పుకొని వైద్యవిద్యార్థిని ఆవేదన చెందింది. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారని బాధపడింది. పోలీసులతో సైఫ్ కు నాన్న ఫోన్ చేయించిన లాభం లేదని తల్లితో చెప్పుకుంటూ కుమిలిపోయింది.
సైఫ్ పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒక్కటై తనను దూరం పెడతారని తల్లితో చెప్పింది. ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలని హెచ్వోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించింది.. ఈ మాటలు విన్న తల్లి..సైఫ్ తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని కూతురికి ధైర్యం చెప్పింది.
అయితే ఎంజీఎంలో ఒక సారి గుండె ఆగిపోగా.. నిమ్స్ లో చేర్చినప్పటి నుంచి గుండె అయిదుసార్లు ఆగిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ చేసి పనిచేసేలా చేసినట్లు పేర్కొన్నారు.