టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ‘నిరుద్యోగుల అరిగోస’పేరిట గాంధీ భవన్ వద్ద దీక్షకు దిగారు. కమిషన్‌లో చోటు చేసుకుంటున్న అక్రమాలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. దీక్ష చేస్తున్న క్రమంలో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. టీఎస్పీఎస్పీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు బయలు దేరాయి..
దీంతో వారిని గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ గాంధీ భవన్ గేట్ ఎక్కి కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపైకి దూసుకువచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.