కిరాయి కట్టడం లేదని బోరబండలోని టీఆర్ఎస్ కార్యాలయాన్ని యజమాన్ని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం కోసం అద్దెకు తీసుకొని ఏడేళ్లుగా అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండటంతో ఆ ఇంటి యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయస్థానం ఆదేశాలతో కార్యాలయాన్ని ఖాళీ చేయించేందుకు ఆ ఇంటి యజమాని ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్పొరేటర్ బాబా తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల సాయంతో యజమాన్ని ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం తన ఇంటిని ఏడేళ్ల క్రితం బాబా ఫసియుద్దీన్ అద్దెకు తీసుకున్నట్లు ఆ ఇంటి యజమాని తెలిపారు.
అద్దె కట్టాలని చాలా రోజులుగా అడుగుతున్నా, ఇవ్వకుండా తనను బాబా ఇబ్బందులకు గురిచేశారని ఆయన వాపోయారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని వారిని అడిగితే మళ్లీ దౌర్జన్యానికి దిగారని ఆయన అన్నారు.