ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన కమలం శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇక ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్‌పైన ప్రధాని చేసిన సూటి విమర్శలు ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్లు సంకేతాలు పంపినట్లయింది. తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే అన్న మోడీ వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.
కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయాలని, రాష్ట్రాన్ని కాపాడుకుందామని యువతకు మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు వ్యూహం ప్రకారం ఇచ్చినదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో యువత కీలకంగా వ్యవహరించిన సందర్భాన్ని మోడీ గుర్తు చేశారు. దానికి తోడు ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కలిసి పోరాటం చేయాలన్న పిలుపు ద్వారా అధికార పార్టీపై యుద్ధం ప్రకటించినట్లయింది.
స్వరాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ యువత చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. ఈ నేపథ్యంలోనే మోడీ యువమంత్ర జపం చేసేందుకు సిద్ధమయ్యారని, ఆ జపం రాజకీయ ప్రయోజనాల కోసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైన ఉందని మోడీ చెప్పారు. బీజేపీ నాయకత్వంలో యువత నిరంకుశ పాలన సాగిస్తున్న రాష్ట్రసర్కార్‌పై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పోరాటంలో విజయం తథ్యమని జోస్యం చెప్పారు. మొత్తంగా మోడీ తన హైదరాబాద్ పర్యటనతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీ మేజర్ ప్లేయర్ అని ప్రజలకు సంకేతాలు పంపారు.