ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఇప్పటికీ వాట్సాప్ ప్రథమ స్థానంలోనే ఉంది. ఈ క్రమంలోనే 2020లో ఈ యాప్‌ను యూజర్లు ఎక్కువగా ఉపయోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో జనాలు కాల్స్ చేసుకునేందుకు, మెసేజ్‌లకు, ఆఫీస్ పనికి వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాదిలో వాట్సాప్‌లో వచ్చిన పలు ఉత్తమ ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ పేమెంట్స్…
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వాట్సాప్ పేమెంట్స్ కు నవంబర్ నెలలో అనుమతి ఇచ్చింది. దీంతో వాట్సాప్‌లో యూపీఐ ద్వారా నగదు పంపించుకునేందుకు సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల వినియోగదారులకు వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. మొదటి దశలో 2 కోట్ల మంది యూజర్లకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందిస్తోంది.
డార్క్ మోడ్…
వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఈ ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల యూజర్లు తమ డివైస్‌లలో వాట్సాప్‌ను డార్క్ మోడ్‌లో చూసేందుకు అవకాశం లభించింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్, డెస్క్‌టాప్ వెర్షన్లకు చెందిన వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంది.
డిజప్పియరింగ్ మెసేజెస్…
వాట్సాప్‌లో డిజప్పయరింగ్ మెసేజెస్ ఫీచర్ కూడా ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఆప్షన్ ను యూజర్లు ఎనేబుల్ చేసుకుంటే వారి ఫోన్లలో ఎవరికైనా మెసేజ్‌లు పంపితే అవి వారం రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. తరువాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిగ్గా మాయమవుతాయి.
వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్…
కరోనా నేపథ్యంలో చాలా మంది ఇండ్లలో ఉంటున్న కారణంగా, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసిన కారణంగా వాట్సాప్‌లో ఉన్న గ్రూప్ వీడియో, వాయిస్ కాల్ ఫీచర్‌ను ఎక్కువ మంది ఉపయోగించుకున్నారు. అయితే ఈ ఫీచర్‌కు గాను వాట్సాప్ యూజర్ల సంఖ్యను పెంచూ సదుపాయం కల్పించింది. గతంలో 4 మందికే ఈ ఫీచర్‌ను పరిమితం చేయగా ఇప్పుడు ఈ ఫీచర్‌ను 8 మంది వరకు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకేసారి 8 మంది గ్రూప్ కాల్స్‌లో మాట్లాడుకోవచ్చన్నమాట. ఈ క్రమంలోనే నిత్యం ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు 1500 కోట్ల నిమిషాల పాటు వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుకుంటున్నారని వెల్లడైంది.
మ్యూ గ్రూప్స్ ఫరెవర్…
వాట్సాప్‌లో విసుగెత్తించే గ్రూప్‌లకు చెందిన నోటిఫికేషన్లను ఇకపై పర్మినెంట్‌గా మ్యూట్ చేయవచ్చు. అందుకు గాను ఆల్వేస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గ్రూప్‌కు చెందిన మ్యూట్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ లభిస్తుంది. అలాగే 8 గంటలు, 1 వీక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఏదైనా గ్రూప్‌కు చెందిన నోటిఫికేషన్లను కొంత సమయం పాటు మ్యూట్ చేయదలిస్తే ఈ రెండు ఆప్షన్లు ఉపయోగపడతాయి.