తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ పడాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్, మాజీ ఎంపీ మల్లు రవిలు పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే కేవలం 12 మంది సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం సీడబ్ల్యుసీ సభ్యుల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మహిళ,యువత తదితర వర్గాలు సగం రిజర్వేషన్ లను వర్తింపచేస్తాయి. మిగిలిన సగం మంది జనరనల్ కోటా కింద ఎంపిక కావాల్సి ఉంది. ఈ ఎంపికలో 1338 మంది ఏఐసీసీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల 26వ తేదీన జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్లీనరీలో మాత్రం ఏఐసీసీ సభ్యులతో పాటు 9,915 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మరో 3000 మంది నామినేటెడ్ సభ్యులు మొత్తం కలిసి దాదాపు 15 వేల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే సీడబ్ల్యుసీ పదవి అనేది ఉన్నతమైనది అయ్యినందున కాంగ్రెస్ అధిష్టానం వివిధ అంశాలను ఆధారం చేసుకొని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీకి విధేయులుగా ఎంత కాలం నుంచి ఉన్నారు. ఇప్పటి వరకు ఏయే పదవులు అనుభవించారు. ఆ సమయంలో పార్టీ బలోపేతానికి వారు చేసిన కృషి ఏమిటి అనే అంశాలతో పాటు ఎంపిక కాబోయే నాయకుడు దేశంలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడతారు అనేది పరిశీలించనున్నారు.