ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండగగా పేరున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి సిద్ధం అయింది. ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతోంది. మూడు రోజుల పాటు సాగే ఈ జాతరకు కోట్లల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికే తలమానికం అని కీర్తించారు.
బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు పవన్.
తెలంగాణ వాసులతో పాటు, దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడాలని వేడుకుంటున్నానన్నారు. ప్రజలను చల్లగా చూడాలని ప్రణామాలు అర్పిస్తున్నట్టు పవన్ తెలిపారు. వనదేవతలను దర్శించుకుంటే జన్మ దన్యం అవుతోందన్నారు.