ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎట్టకేలకు ముగిసింది. కరోనా వల్ల టోర్నీ ఆలస్యం అయినప్పటికీ ప్రేక్షకులు గత ఏడాది కన్నా ఈ సారి భారీ ఎత్తు ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే అది కూడా భారత్‌లోనే జరగనుండడంతో ఇప్పుడు ఫ్రాంచైజీలు టీంలలోని ప్లేయర్లపై మరోసారి నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సారి కొత్తగా మరో టీంను ఐపీఎల్‌లో ప్రవేశపెడుతారని సమాచారం అందుతుండడం, అలాగే ఈ సారి ప్లేయర్లకు పూర్తి స్థాయిలో వేలం నిర్వహిస్తారని వార్తలు వస్తుండడంతో ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న ప్లేయర్లలో ఎవర్ని ఉంచాలి, ఎవర్ని తీసేయాలి.. అని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
వచ్చే సీజన్‌గాను పలు ప్లేయర్లను వదులుకోవాలనే టీంలు ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు ఈ సీజన్‌లో అంతగా రాణించని, బెంచ్‌కే పరిమితమైన ప్లేయర్లను వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆ విషయానికి వస్తే చెన్నైలో కేదార్ జాదవ్, డ్వేన్ బ్రేవో, హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు ముందు వరుసలో ఉన్నారు. బ్రేవో గాయాల కారణంగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇక కేదార్ జాదవ్‌కు అవకాశాలు పుష్కలంగా వచ్చినా విఫలం అయ్యాడు. అలాగే హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకున్నారు. దీంతో వీరందరినీ చెన్నై వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. డేల్ స్టెయిన్, ఉమేష్ యాదవ్, మొయిన్ అలీలు పెద్దగా రాణించలేదు. ప్రత్యర్థి జట్లకు భారీగా పరుగులు ఇచ్చారు. దీంతో బెంగళూరు జట్టు వీరిని టీం నుంచి తప్పిస్తుందని తెలిసింది. అలాగే ముంబై ఇండియన్స్‌లో షెర్ఫానె రూథర్‌ఫోర్డ్, మిచెల్ మెక్‌క్లెనఘన్‌లు ఈసారి బెంచ్ కే పరిమితం అయ్యారు. సింగిల్ గేమ్ కూడా ఆడలేదు. దీంతో ముంబై వీరిని తిరిగి వేలంకు పంపిస్తుందని తెలిసింది. ఇక ఇతర జట్లు కూడా అంతగా ఆకట్టుకోని పలువురు ప్లేయర్లను వదిలించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్లేయర్ల వివరాలు త్వరలో తెలియనున్నాయి.