సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటో గుర్తించారు అధికారులు. ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించిన డక్ట్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అందుబాటులో అగ్నిమాపక పరికరాలు ఉన్నప్పటికీ పనిచేసే స్థితిలో లేవని నిర్ధారించారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో వాటిని తెరిచామన్నారు. తొలుత ఎలక్ట్రిక్ వైర్ల డక్ట్ లో మొదలైన మంటలు.. నాలుగో ఫ్లోర్ వరకు లోలోపలే విస్తరించాయి. ఆ తర్వాత ఐదో ఫ్లోర్ లో డక్ట్ తెరిచి ఉండటంతో ఈ మంటలు చెలరేగగా.. ఆరు, ఏడు అంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించినట్లు అధికారులు ధృవీకరించారు.
బయటకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలో చెత్త, పనికిరాని వస్తువులతో దారి మొత్తం మూసేసినట్లు గుర్తించారు. భవనంలో సెట్ బ్యాక్ లు ఉన్నప్పటికీ పార్క్ చేసిన వాహనాలతో నిండిపోయాయని పరిశీలనలో తేలిందన్నారు. ఆ కారణంగా బ్రోంటో స్కైలిఫ్ట్ సకాలంలో ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందని చెప్పారు. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని పార్కింగ్ చేసిన వాహనాలు తొలగించాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ నాళాలు ఫైర్ డోర్స్ కు బదులుగా.. చెక్క తలుపులతో కప్పేశారు. 5వ అంతస్తులోని కారిడార్లు, కేజింగ్ కార్డు బోర్డు పెట్టెలు, స్క్రాప్ మెటీరియల్ తో నిండి ఉన్నాయి. ఇవి ఎలక్ట్రికల్ డక్ట్ నుంచి వచ్చిన మంటలను తాకడంతో మంటల తీవ్రత పెరిగింది. అలా ఎలక్ట్రికల్ డక్ట్ గుండా మంటలు వెళ్లి 5వ అంతస్తులో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.
ఈ కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు కావడం లేదని, పైపులు ఉన్నా పని చేయడం లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్ లోని ఐదో అంతస్తులో ఫ్లోర్ కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్ ను లాక్ చేసి ఉంచడం.. అక్కడ సామాన్లు పెట్టుకోవడం కూడా ఆ ఆరుగురి మృతికి కారణమైందన్నారు డీజీ నాగిరెడ్డి.