హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ బీజేపీ చిట్ట చివరకు పంతం నెగ్గించుకుందా అన్న చర్చ తెరపైకి వస్తుంది. నిజానికి ఆగస్టులోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని బీజేపీ నాయకులు నమ్మకంగా ఉన్నా… కరోనా పేరుతో వాయిదా పడింది. కానీ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ఉప ఎన్నికలతో హుజురాబాద్ బైపోల్ వస్తుందనుకున్నారు.
అయితే, ఆ రెండు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా హుజురాబాద్ ఎన్నికకు రాలేదు. అప్పుడు కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో కేసీఆర్ లాబీయింగ్ చేశారని, అందుకే వాయిదా పడిందని అంతా అనుకున్నారు. ఓ దశలో బీజేపీ అగ్రనాయకత్వం-కేసీఆర్ కలిసి నడుస్తున్నారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది.
పైగా ఇప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే ఉండగా…. నోటిఫికేషన్ వస్తుందని ఆయనకు తెలుసని, వాయిదా వేసేందుకు ప్రయత్నం చేసినా రాష్ట్ర బీజేపీ ఒత్తిడితోనే అగ్రనాయకత్వం సాహసం చేయలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇటీవల షా పర్యటనలో వాట్ ఈజ్ వాట్ అని అంతా వివరించారని, అందుకే ఎన్నిక విషయంలో లోకల్ అభిప్రాయానికే కేంద్రం నాయకత్వం ఓటేసిందని బీజేపీ వర్గాలంటున్నాయి.