ఒకప్పుడు అవి మామూలు ఏనుగులు.మరి ఇప్పుడు ఆస్కార్ అందుకున్న ఏనుగులు. విషయం మీకు అర్ధమయ్యే ఉంటుంది.’ది ఎలిఫేంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ ఫిల్మ్ తో ఆస్కార్ సాధించిన ఏనుగులు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాయి. వాటిని చూడటానికి టూరిస్ట్లు ఎగబడి వస్తున్నారు.
తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వులో ఏనుగుల ఫీడింగ్ క్యాంపు ఉంది.అడవి నుంచి తప్పిపోయిన ఏనుగులను ఇక్కడ సంరక్షించి ఆహారం అందిస్తారు.
అయితే అనాథ పిల్ల ఏనుగులు బెంగపడకుండా ఉండేందుకు వాటిని చేరదీసే బాధ్యతలను స్థానికంగా ఉండే గిరిజనులకే అటవీశాఖ అధికారులు అప్పగిస్తారు.బొమ్మన్, బెల్లి అనే గిరిజన జంట అలాగే రెండు అనాథ ఏనుగులను సంరక్షించింది. అదే కథను దర్శకురాలు కార్తికీ డాక్యుమెంటరీగా తీశారు.
ఆ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును సాధించడం వల్ల దేశ, విదేశీ పర్యాటకులు ముదుములై టైగర్ రిజర్వు బాటపట్టారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వు ప్రాంతంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది.
ఏనుగులే కాకుండా అనేక వన్యప్రాణులకు ఈ ప్రాంతం నిలయం. టైగర్ రిజర్వులో భాగంగానే ఏనుగుల ఆహార కేంద్రాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఆస్కార్ జ్యూరీ మనసులు గెలుచుకున్న గజరాజులే కాకుండా.. అనేక ఏనుగులు అక్కడ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.
డాక్యుమెంటరీలో ఏనుగులను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఫోటోలు తీస్తూ గజరాజుల చేష్టలను చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదేశీయులు కూడా ఏనుగులను చూడటానకి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
డాక్యుమెంటరీలో కనిపించిన గిరిజన మహిళ బెల్లి పర్యాటకుల కోరిక మేరకు.. ఏనుగులతో అక్కడ ఉండే జంతువులతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు.