కొందరు నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు కట్టుకోమని ఎర్రమంజిల్ క్వార్టర్స్ పక్కన స్థలంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. దాంతో వారంతా ఇళ్లు కట్టుకున్నారు, కరెంట్ , వాటర్ కనెక్షన్లు కూడా తీసుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో మంగళవారం సాయంత్రం అధికారులు ఒక్కసారిగా ఇళ్లను కూల్చే ప్రయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను ఎలా కూలుస్తారంటూ అధికారులను నిలదీశారు. వెంటనే ఎమ్మార్వోతో మాట్లాడారు. దీంతో ఎమ్మార్వో అక్కడి నుంచి జేసీబీలను వెనక్కి పిలిచారు. దాంతో ఇళ్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు.
ఇళ్లలోని సామాగ్రిని బయటకు విసిరేసి కూల్చివేతలు మొదలు పెట్టారు. బాధితులు ఎంత వేడుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయా రెడ్డి మళ్లీ అక్కడికి వచ్చారు. పట్టాలున్నాయి..కరెంట్ వాటర్ బిల్లులు కూడా కడుతున్నారు. ఇళ్లను ఎలా కూలుస్తారంటూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఈ సంఘటన గురించి కార్పొరేటర్ విజయా రెడ్డి మాట్లాడుతూ..శత్రు దేశం పై దాడి చేసినట్లుగా రెవెన్యూ అధికారులు పేదల ఇళ్ల పై దాడి చేశారని పేర్కొన్నారు. వందల మంది పోలీసులు నలుగురైదుగురు ఎమ్మార్వోలు జేసీబీలతో వచ్చి ఇళ్లను కూల్చి వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పట్టాలున్నాయని చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోకుండా కూల్చివేతలు మొదలు పెట్టారని ఆమె ఆరోపించారు.