సూపర స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన బటర్ ఫ్లై సినిమాను తలపిస్తోంది ఈ చోరీ. అచ్చం ఆ సినిమాలో ఇంటి పని మనిషి, డ్రైవర్ కలిసి కిడ్నాప్ కు స్కెచ్ వేసినట్టుగానే.. ఐశ్వర్య ఇంట్లో కూడా అదే జరిగింది.
ఇక ఫుల్ డీటైల్స్ లోకి వెళితే..ఐశ్వర్య రజనీకాంత్.. గత నెలలో తన ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 లో తన సోదరి సౌందర్య పెళ్లి కోసం చివరిగా నగలను ధరించినట్లు ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డైమండ్ సెట్స్, పాత బంగారు ఆభరణాలు, నవరత్న సెట్లు, నెక్లెస్ లు, బ్యాంగిల్స్ చోరీకి గురైనట్టు ఆమె పేర్కొన్నారు. తన సోదరి పెళ్లిలో ఆభరణాలు ధరించిన తరువాత వాటిని లాకర్ లో ఉంచినట్లు చెప్పారు ఆమె.
ఇక 2019 నుంచి మూడు ఇళ్లు మారామని, కానీ ఎక్కడా తెరవలేదని చెప్పారు. కానీ ఫిబ్రవరి 10న చూసేసరికి ఆభరణాలు కనిపించలేదని పేర్కొన్నారు. అయితే లాకర్ లో నగలు ఉన్నట్లు తన ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు తెలుసని ఆమె పోలీసులకు చెప్పారు. వారిపైనే అనుమానం ఉన్నట్లు తెలిపారు. అయితే దీన్ని బిగ్ క్లూగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు.. ఐశ్వర్య ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ ను తమదైన శైలిలో విచారించే సరికి గుట్టంతా రట్టైంది.
ఐశ్వర్య కారు డ్రైవర్ వెంకటేశన్ సహకారంతో పనిమనిషి ఈశ్వరినే ఈ భారీ దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈశ్వరి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు,నాలుగు కిలోల వెండి ఆభరణాలను దొంగిలించింది. అయితే ఐశ్వర్య ఇంట్లో 18 ఏళ్లుగా పనిమనిషిగా ఉన్న ఈశ్వరికి ఇంటి పై పూర్తి అవగాహన ఉంది. దీంతో 2019 నుంచి పలుమార్లు లాకర్ తెరిచి నగలను దొంగిలించింది.
ఇక ఆ నగలను అమ్మిన ఆమె వాటిలో కొంత భాగాన్ని డ్రైవర్ వెంకటేశన్ కు ఇచ్చింది. అంతే కాదు ఆ సొమ్ముతో ఇల్లు కొనుగోలు చేసింది. ఇక విచారణలో వీళ్ళిద్దరు నిజం చెప్పేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు.