ఇద్దరు హైదరాబాదీలు కలిసి శుభారంభం అంటూ మంత్రి కేటీఆర్, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో పాటు తాము బిజినెస్ అండ్ బిర్యానీ గురించి చాట్ చేశామంటూ ఓ స్మైల్ ఎమోజీని షేర్ చేశారు కేటీఆర్.
అంతకు ముందు చాట్ రోబోట్ సాఫ్ట్ వేర్ చాట్ జీపీటీకి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి సరదాగా సంభాషణ జరిగింది. బెంగళూరులోని ఫ్యూచర్ రెడీ సమ్మిట్ లో పాల్గొన్న నాదెళ్ల, పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏమిటో చెప్పాలని చాట్ జీపీటీని అడిగారు. దీనికి సమాధానంగా చాట్ జీపీటీ సాఫ్ట్ వేర్ ఇడ్లీ, దోశ, వడా పేర్లు చెబుతూనే బిర్యానీని కూడా టిఫిన్ గా పేర్కొంది.
ఒక హైదరాబాదీ అయిన తనకు బిర్యానీ టిఫిక్ కాదనే విషయం తెలుసని, తన ఇంటెలిజెన్స్ ను పరీక్షించాల్సిన అవసరం లేదని నాదెళ్ల పేర్కొన్నారు. దీనికి ఈ చాట్ బోట్ సారీ చెప్పింది కూడా. నాదెళ్ల ఇడ్లీ, దోశలో ఏది బెటరో చెప్పమని కూడా ఈ ఏఐ బేస్డ్ చాట్ బోట్ ను అడిగారు. ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి మాట్లాడేముందు చాట్ బోట్ కు ఆయనీ ప్రశ్నలు వేశారు.
బెంగుళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో .. ఇండియాలో కొనసాగుతున్న అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్ ఆవిష్కరణల గురించి సత్య నాదెళ్ల తన ప్రెజెంటేషన్ ఇచ్చారు.. టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈ సరదా సంభాషణ సాగింది.
ఇది అక్కడితో ఆగలేదు.. తమలో ఏది బెస్ట్ టిఫిన్ అన్న అంశంపై ఇడ్లి, దోసె, వడ మధ్య జరిగిన వివాదం మీద ఓ డ్రామాను సృష్టించాలని ఆయన చాట్ జీపీటీని కోరడం, షేక్స్ పియర్ నాటకంలోని భాగంమాదిరి పిండికి, సాహిత్యానికి మధ్య డైలాగ్ ని రూపొందించాలని సూచించడం వంటివి ఆద్యంతం అక్కడివారికి నవ్వుల పువ్వులు పూయించాయి. ఇలాంటి మోడల్ లు ప్రజల ఊహలను ఎలా ఆకర్షిస్తాయో చూడడం సరదాగా ఉంటుందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.