‘మీరు నాకిస్తున్న టీలో విషం కలపవచ్చు.. అందుకే వద్దంటున్నా’ అన్నారు యూపీ పోలీసులతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. రాష్ట్ర పోలీసులపై ఆయనకు అంత అపనమ్మకం ఉంది. ఆదివారం డీజీపీ ప్రధాన కార్యాలయానికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు పోలీసులు టీ ఇవ్వబోగా తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు బయటి నుంచి టీ తెచ్చి ఇవ్వాలని అఖిలేష్ .. తమ పార్టీ కార్యకర్తలను కోరారు. మీ తేనీరు మీరే తాగండి అని కూడా పోలీసులను కోరారు. సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్ ను పోలీసులు అరెస్టు చేయడంతో తన నిరసనను వ్యక్తం చేసేందుకు ఆయన లక్నోలోని డీజీపీ ఆఫీసుకు వచ్చారు.
పార్టీ కి చెందిన ఖాతాలో అగర్వాల్… మహిళల పట్ల, బీజేపీ నేతలపట్ల అభ్యంతరకరమైన కొన్ని పోస్టులు పెట్టడంతో ఆయనను హజ్రత్ గంజ్ పోలీసులు అరెస్టు చేసి మూడు కేసులు పెట్టారు. ఈ అరెస్టు అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఈ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
కొన్ని గంటలపాటు వారి నిరసన కొనసాగింది. యూపీలో కొంతకాలంగా బీజేపీకి, సమాజ్ వాదీ పార్టీకి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. . బీజేపీ యువ మోర్చా ఇన్-ఛార్జ్ రిచా రాజ్ పుత్ కూడా సమాజ్ వాదీ పార్టీపై కేసు పెట్టారు.