రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అంటే ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా పండగను జరుపుకుంటారు. ఇగ ఆంధ్రా ప్రాంతంలో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండగ గురించి తెలియని ప్రజలు ఉన్నారంటే నమ్ముతారా..? నమ్మాలనిపించడంలేదు కానీ నమ్మక తప్పదు.
విజయనగరం జిల్లాలోని డొంగురువలస, ఎరకందొరవలస, మోసూరువలస, బట్టివలస, అక్కేనవలస, రాజచెరువువలస, చిలకమ్మవలస, విజయపురి, సిమిడిగుడ్డివలస, మూలవలస తదితర 18 గిరిజన గ్రామాలకు భోగీ పండగ సంగతే తెలియదంట. వారెవరూ భోగి, సంక్రాంతి పండగలు చేసుకోరంట. వారంతా మైదాన ప్రాంతాలలో ఉన్న గిరిజనులే అయినప్పటికీ.. వీరంతా బొబ్బిలి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోనే నివసిస్తున్నారు.
వాళ్లు ఇటుకల పండగ, పిల్లి పండగలను మాత్రమే నిర్వహిస్తారు. ఆ గిరిజనుల్లో కొందరు క్రిస్మస్ చేసుకుంటారు. అయితే ఇటీవలే సమరసతాసేవాసంస్థ డొంగురువలస, రాజచెరువువలస గిరిజనానికి హిందూమతాన్ని పరిచయం చేయడంతో హిందూ సంప్రదాయాలను ఇటీవల ప్రారంభించినప్పటికీ భోగి, సంక్రాంతి పండగలు నిర్వహించలేదని చెప్తున్నారు అక్కడి ప్రజలు.