మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజా సాయి ధరమ్ తేజ్ ద్వారా వసంత్ కుమార్ తో బంధుత్వం కూడా ఉందని అన్నారు.
పోరాట యాత్ర సందర్భంలో ఆయనతో భేటీ అయ్యానని చెప్పారు. ఆ తరువాత పలు సందర్భాల్లో ఆయనతో చర్చలు జరిపేవాడినని, ఎంతో ప్రోత్సాహకరంగా సానుకూల దృక్పథంతో మాట్లాడేవారని అన్నారు. రాజకీయంగా తన పురోగతిని ఆకాంక్షించారని, జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మొదటి నాయకుడు ఆయనే అని చెప్పారు.
వట్టి వసంత్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ..ఆయన కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ అన్నారు. ఇక మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆదివారం తెల్ల వారుజామున తుది శ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా 2004,2009 లలో ఎన్నికయ్యారు.
2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. రోశయ్య క్యాబినెట్ లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు.