బీహార్ లోని బుద్ధ గయలో పర్యటిస్తున్నబౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా భద్రతకు ముప్పు కలిగించేందుకు ఓ మహిళ కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళా చైనా జాతీయురాలని, ఆమె పేరు సోంగ్ షియావోలన్ అని తెలిపారు.
ఆమె రూపురేఖలతో కూడిన స్కెచ్ ను కూడా విడుదల చేశారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గత గురువారం నుంచి బీహార్ లోని బుద్ధ గయలో పర్యటిస్తున్నారు. కోవిడ్ 19 మహమ్మారి కరాణంగా రెండేళ్ళ పాటు ఆయన ఈ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంలో పర్యటించలేదు. అంతకు ముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. గతవారం ఆయనకు గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్ ప్రీత్ కౌర్, ఆయన అనుచరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన టిబెటన్ మానెస్టరీకి వెళ్లే వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు.
దలైలామా డిసెంబర్ 29 నుంచి 31 వకు కాలచక్ర మైదానంలో ఉపన్యాసాలు ఇస్తారు. ఆయనకు భద్రతకు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. 2018 జనవరిలో ఇక్కడ తక్కువ తీవ్రత గల పేలుడు జరిగిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఉపన్యాసాల కోసం ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది వస్తారు. అందువల్ల కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజారోగ్య శాఖ కోరింది.
ఇక దలైలామాకు హాని కల్గించేందుకు చైనా మహిళా సోంగ్ కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరింత భద్రతా చర్యలను తీసుకుంటున్నారు పోలీసులు. ఆమె రూపు రేఖలతో కూడిన ఓ స్కెచ్ ను విడుదల చేశారు.